కంబోడియా, థాయ్‌లాండ్ మధ్య వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల సైనికులు పరస్పరం కాల్పులకు పాల్పడ్డాయి. కాంబోడియా ఆర్టిలరీ, రాకెట్లు సహా భారీ ఆయుధాలను ప్రయోగించినట్టు థాయిలాండ్ ఆరోపించింది. ఈ దాడుల్లో ఒక సైనికుడు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారని థాయిలాండ్ ప్రకటించింది. గత మే నెలలోనూ ఇరు దేశాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా. ఈ ఘటనలో కంబోడియా సైనికుడు మృతి చెందినట్టు కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కంబోడియా ప్రీఅహ్ విహియర్ ప్రావిన్సు, థాయ్‌లాండ్ ఉబోన్ రట్చతాని ప్రావిన్స్ మధ్య సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకుంది. మే నెలలో ఉద్రిక్తతలు రెండు రోజుల్లోనే సమసిపోయాయి.
రెండు దేశాల సైనికులు వెనక్కి తగ్గారు. దౌత్య చర్చల ద్వారానే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అప్పట్లో వెల్లడించారు. కానీ, మళ్లీ మరోసారి ఇరుదేశాలూ దాడులకు దిగడంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.అయితే, కంబోడియా, థాయ్‌లాండ్ మధ్య ప్రేఅహ్ విహియర్ ఆలయం విషయంలో దశాబ్దాలుగా సరిహద్దు వివాదం కొనసాగుతుంది. 2011లో ఈ ఆలయం కోసం ఇరుదేశాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న సరిహద్దు వివాదానికి ఇది మూలకారణం. ప్రేఅహ్ విహియర్ ఆలయాన్ని 1000 ఏళ్ల కిందట ఖ్మేర్ రాజవంశానికి చెందిన చక్రవర్తులు సూర్యవర్మన్ 1, సూర్యవర్మన్ 2లు క్రీ.శ. 9 నుంచి క్రీ.శ 12వ శతాబ్దం మధ్య నిర్మించి శివుడ్ని ప్రతిష్ఠించారు.
ఈ ఆలయం కంబోడియాలోని ప్రీఅహ్ విహియర్ ప్రావిన్స్‌లో ఉన్నప్పటికీ, థాయ్‌లాండ్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్న ఒక కొండపై దక్షిణ భారత శిల్పశైలిలో నిర్మితమైంది. ఖ్మేర్ శిల్పకళలో అద్భుతమైన నమూనా ఇది. శివుడిని పూజించే స్థలంగా ఇది పూర్వకాలంలో ఖ్మేర్ పాలకులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. 2008లో ఈ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ రేకెత్తాయి.
ఆలయం కంబోడియా భూభాగంలో ఉన్నా, దాని చుట్టూ ఉన్న భూమిపై తమకు హక్కుందని థాయ్‌లాండ్ వాదిస్తోంది. ఆలయానికి చేరే మార్గాలు థాయ్ ప్రాంతం గుండా వెళ్లే కారణంగా ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ వివాదంపై 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియా అనుకూలంగా తీర్పు వెలువరించింది. సరిహద్దు నియంత్రణ రేఖలు స్పష్టంగా లేవని థాయ్‌లాండ్ వాదిస్తుంది. 2008 నుంచి 2011 వరకూ ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 2011లో భారీ కాల్పులకు ఈ ఆలయం కూడా స్వల్పంగా దెబ్బతింది.
‘కంబోడియా సైన్యం స్థావరంగా ఉపయోగిస్తున్న ఓ ప్రాంతంపై థాయ్ సైన్యం కాల్పులు ప్రారంభించిందని, ఆ కాల్పుల వల్ల మా సైనికుడు ఒకరు మరణించారని’ కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. థాయ్‌లాండ్ వాదన ప్రకారం.. తమ సైనికులు వివాదాస్పద ప్రాంతంలో కంబోడియా సైనికులు ప్రవేశించకుండా మాటల ద్వారా వెనక్కి పంపేందుకు ప్రయత్నించగా, వారు కాల్పులకు దిగారని థాయ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ విన్‌థాయ్ సువారీ తెలిపారు. ఈ కాల్పులలో థాయ్ సైనికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
‘కంబోడియా దళాలు పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకుని ఆయుధాలను ఉపయోగించాయి, అందువల్ల థాయ్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి’ అని విన్‌థాయ్ చెప్పారు. ఈ కాల్పుల మార్పిడి సుమారు 10 నిమిషాలు కొనసాగిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రక విభేదాలు ఉన్నప్పటికీ, థాక్సిన్ షినవత్ర (థాయ్‌లాండ్), హున్ సేన్ (కంబోడియా) మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వాల మధ్య సంబంధాలు అనుకూలంగా ఉన్నాయి. వారి వారసులే ప్రస్తుతం తాత్కాలికంగా ప్రధాన మంత్రులుగా ఉన్నారు.