అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అగ్రరాజ్యానికి వెళ్లేందుకు అనేక సవాళ్లు ఎదురవుతున్న సమయంలో.. ఆ దేశానికి వెళ్లాలి అనుకునేవారికి ఓ-1 వీసా ఇప్పుడు తెగ పాపులర్ అవుతోంది. అమెరికాకు వెళ్లాలనుకునే వృత్తి నిపుణులు అంతా ఇప్పుడు ఈ ఓ-1 వీసాపై కన్నేశారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాలకు ప్రత్యామ్నాయంగా మారిన ఓ-1 వీసా కోసం భారతీయులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. యూఎస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 కింద.. ఈ ఓ-1 వీసాలను ప్రవేశపెట్టారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ (ఓ-1ఏ), ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ (ఓ-1బీ) వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలు కలిగిన వారికి.. అద్భుత విజయాలు సాధించినవారికి ఈ ఓ-1 వీసాలను మంజూరు చేస్తున్నారు. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు.. 8 నిబంధనల్లో కనీసం మూడింటినైనా కలిగి ఉండాలి. అవార్డులు, స్కాలర్లీ పబ్లికేషన్లు పొందడం లేదా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యత్వం కలిగిఉండటం, మీడియా కవరేజీ వంటివి ఇందులో నిబంధనలుగా ఉన్నాయి.
అయితే మిగిలిన వీసాలతో పోల్చితే.. ఈ వీసాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ విధానం గానీ.. పరిమితులు గానీ లేకపోవడంతో ఇది అప్లై చేస్తే.. వీసా రాదు అనే భయం ఉండదు. ఏటా ఈ ఓ-1 వీసా దరఖాస్తుదారుల్లో 93 శాతం మందికి వీసాలు వస్తాయంటే.. దీని సక్సెస్ రేట ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో హెచ్-1బీ వీసాల సక్సెస్ రేటు కేవలం 37 శాతమే కావడం గమనార్హం. ఓ-1 వీసాను మొదట 3 ఏళ్ల కాలపరిమితికి జారీ చేస్తారు. ఆ తర్వాత ఎన్ని సార్లయినా దాన్ని పొడిగించుకోవచ్చు. ఇక ఆ ఓ-1 వీసాను లాటరీ లేని హెచ్-1బీ వీసాగా అభివర్ణిస్తారు.
అమెరికా విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రతీ సంవత్సం ఈ ఓ-1 వీసాల జారీ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో 8838 ఓ-1 వీసాలు జారీ చేయగా.. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 18,994కు పెరిగింది. అయితే, దీని దరఖాస్తు రుసుము మాత్రం 10వేల డాలర్ల నుంచి 30వేల డాలర్లుగా ఉంది. సాధారణంగా హెచ్-1బీ దరఖాస్తుకు అయ్యే ఖర్చు 970 డాలర్ల నుంచి 7,775 డాలర్లుగా ఉంటుంది. ఈ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. 2020లో 487 మంది భారతీయులకు ఓ-1 వీసా రాగా.. 2023 నాటికి ఆ సంఖ్య 1418కి పెరిగింది.
ప్రస్తుతం అమెరికా హెచ్-1బీ వీసాలు పొందేందుకు తీవ్ర కష్టమైన పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత సైబర్ నిపుణులు, ఏఐ రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు ఈ ఓ-1 వీసాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. గూగుల్, టెస్లా, ఓపెన్ ఏఐ వంటి టెక్ దిగ్గజ సంస్థలు కూడా ఓ-1 వీసా రూట్లో తమకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. హార్వర్డ్, కొలంబియా వంటి యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ, రీసెర్చర్ల కోసం ఓ-1 వీసాతో నైపుణ్యం గల వారిని నియమించుకుంటున్నారు. లాటరీ సమస్య లేకపోవడం, వీసా జారీ రేటు అత్యధికంగా ఉండటంతో భారత వృత్తి నిపుణులు కూడా ఎక్కువగా ఈ ఓ-1 వీసా వైపు ఆకర్షితులు అవుతున్నారు.