పాకిస్తాన్, పీఓకేలో భారీ వర్షాలు.. ఒకే రోజు 154 మంది మృతి, అనేకమంది గల్లంతు

Image 1

ఉత్తర భారతదేశాన్ని మాత్రమే కాకుండా భారీ వర్షాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోనూ చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆ రెండు ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కరోజులోనే పాక్, పీఓకేలో 154 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించడం.. అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతోంది. వీరితోపాటు వందల మందికి గాయాలైనట్లు తెలిపారు. భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్, ఉరుములు, మెరుపులతో పాక్ వాసులు, పీఓకే ప్రజలు.. అనుక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు.

పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాల్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 154 మంది మృతి చెందినట్లు అధికారులు గణాంకాలు వెల్లడించారు. ఈ కుండపోత వర్షాలకు అనేక మందికి గాయాలు అయ్యాయని వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్‌- బాల్టిస్థాన్‌లో చాలా భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో కుంభవృష్టి వానలకు మృతుల సంఖ్య భారీగా నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.

మరోవైపు.. బునేర్‌ జిల్లాలో 75 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. బాజౌర్‌ జిల్లాలో 18 మంది, బాటాగ్రామ్‌ జిల్లాలో 18 మంది, మాన్సెహ్రా జిల్లాలో 17 మంది చొప్పున భారీ వర్షాల ధాటికి మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుందని.. ఆకస్మిక వరదలతో చిన్నారులు సహా మొత్తం 125 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్, ఆర్మీ, స్థానికులు సహాయక చర్యల్లో మునిగిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా మంది గల్లంతైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రొవిన్షియల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది. భారీ వర్షాలతో పోటెత్తిన వరదలతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయని.. వాహనాలతోపాటు స్కూళ్లు, క్లినిక్‌లు కూడా కొట్టుకుపోయినట్లు తెలిపింది. నీలమ్‌ వ్యాలీ వద్ద చిక్కుకుపోయిన పర్యాటకులను.. ప్రాణాలతో బయటికి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో.. రవాణాకు అంతరాయం కలుగుతోంది.

Related News