ట్రంప్ ఆర్థికంగా నిరక్షరాస్యుడు.. అమెరికాను భారత్ అసలు నమ్మొద్దు.. ప్రముఖ ఆర్థికవేత్త

Image 1

అమెరికాతో ఆర్ధిక భాగస్వామ్యం విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని, తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో అసలు నమ్మొద్దని ప్రముఖ ఆర్ధికవేత్త జెఫ్రీ సాచ్స్ హెచ్చరించారు. అంతేకాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ‘ఆర్థిక నిరక్షరాస్యుడు’ అంటూ విమర్శించారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదగడానికి ఆయన ఎప్పటికీ అంగీకరించరని అన్నారు. ‘‘అమెరికా ఇతర దేశాల పట్ల బాధ్యతగా వ్యవహరించదు.. జాగ్రత్తగా ఉండండి. చైనాతో తప్పుదారి పట్టించే వాణిజ్య యుద్ధంలో ఏదో ఒక విధంగా అమెరికా తనను వినియోగించుకోవడానికి భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు’’ అని సాచ్స్ హెచ్చరించారు.

రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన నేపథ్యంలో సాచ్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాపై వాటిపై ఆధారపడకండి. రష్యా, చైనా, ఆసియా దేశాలు, ఆఫ్రికా వంటి వైవిధ్యభరితమైన భాగస్వాములు భారత్‌కు అవసరం.. ప్రధానంగా అమెరికా మార్కెట్‌పై దృష్టిపెట్టొద్దు ఎందుకంటే ఇది అస్థిరంగా, నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ, ప్రాథమికంగా రక్షణాత్మకంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

‘‘అర్ధికంగా నిరక్ష్యరాస్యుడైన డొనాల్డ్ ట్రంప్ రక్షణవాది... చైనా మాదిరిగానే భారత్‌ను ప్రపంచ వేదికపై ఆర్థికంగా ఎదగడానికి ఎప్పటికీ అనుమతించడు. అమెరికా వెలుపల భారత్‌లో ఐఫోన్‌ ప్లాంట్‌ను విస్తారించాలనే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ నిర్ణయాన్ని అడ్డుకోవడమే ఇందుకు ఉదాహరణ.. కొందరి అభిప్రాయం ప్రకారం.. చైనాకు భారత్ ప్రత్యామ్నాయంగా మారబోతోంది.. అమెరికా చైనాతో పోరాడుతుంది.. చైనా సరఫరా గొలుసులను భర్తీ చేయడానికి న్యూఢిల్లీ స్వాగతిస్తుంది. దీనిని నేను అవాస్తవికమని భావిస్తున్నాను... ప్రస్తుతం చైనా నుంచి అనుమతించినట్టే భారత్ ఎగుమతుల విస్తరణను అమెరికా అనుమతించదు’’ అని అన్నారు.

ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘‘యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్లాంట్లు నిర్మాణానికి భారత్ వెళ్తున్నానని చెప్పారు.. అక్కడకు వెళ్లడం సరైందేనని నేను చెప్పాను, కానీ మీరు సుంకాలు లేకుండా ఇక్కడ అమ్మబోరు’’ అని హెచ్చరించిన సంగతి తెలిసిందే. భారత్ తన భారీ ఇంధన అవసరాల కోసం రష్యా చమురు దిగమతి కొనసాగించడంపై ట్రంప్ ఎవరితో వ్యాపారం చేయాలో నిర్ణయించలేరని సాచ్స్ పేర్కొన్నారు.

‘‘అంతర్జాతీయ చట్టం ప్రకారం అమెరికా ఏకపక్ష చర్యలు చట్టవిరుద్ధం. ఈ రోజుల్లో అది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ మనకు వాస్తవానికి నియమాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టం ఉంది... ట్రంప్ చర్యలు అమెరికా, అంతర్జాతీయ చట్టం దృక్కోణంలో చట్టబద్ధమైందని నేను అనుకోను. ఎవరితో వ్యాపారం చేయాలో భారతదేశానికి చెప్పే హక్కు అమెరికాకు లేదు లేదా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న రష్యా, దాని భాగస్వాములను శిక్షించే హక్కు అమెరికాకు ఉందనే వాదన సరైంది కాదు’’ అని తేల్చిచెప్పారు.

Related News