2022 నుంచి ఆసుపత్రిలోనే థాయ్ యువరాణి.. మూడేళ్ల తర్వాత హెల్త్‌ బులిటిన్

Image 1

మూడేళ్ల కిందట గుండెపోటుకు గురైన థాయిలాండ్‌ యువరాణి బజ్రకితియభా మహిడోల్ అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఏమైందో? ప్రాణాలతో ఉన్నారా? అనేది అంతా మిస్టరీయే. ఈ క్రమంలో యువరాణి ఆరోగ్య పరిస్థితిపై వైద్య వర్గాలు, రాజ కుటుంబం తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాయి. బజ్రకితియభా ఊపిరితిత్తులు, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వైద్య పరికరాల సాయంతో వాటిని పనిచేసేలా చేస్తున్నామని తెలిపాయి. ఇటీవల ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో రక్తంలో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్దారణ అయ్యిందని వివరించాయి.

యువరాణికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నాయి. డిసెంబర్‌ 2022న థాయ్‌లాండ్‌లోని ఖోవొ యై జాతీయ పార్కులో జరిగిన ఓ కార్యక్రమంలో యువరాణి బజ్రకిటయభా పాల్గొన్నారు. ఇందులో భాగంగా పెంపుడు శునకాలకు శిక్షణ ఇస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె గుండెపోటుకు గురికావడంతో పక్కనే ఉన్న సిబ్బంది తక్షణమే స్పందించి.. ఆమెకు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బ్యాంకాక్‌కు తరలించారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

ఆ సమయంలో ఆమె మరణించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, రాయల్ ప్యాలెస్ మాత్రం యువరాణి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం రాలేదు. మూడేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు హెల్త్‌ బులెటిన్‌ బయటకొచ్చింది.

థాయిలాండ్‌ రాజు మహా వజిరలాంగ్‌కార్న్‌ తొలి భార్య సోమ్‌సావాలి కుమార్తె అయిన బజ్రకితియభా... ‘ప్రిన్సెస్‌ భా’గా గుర్తింపు పొందారు. బ్రిటన్‌, అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆమె.. థాయ్‌లాండ్ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియాలో థాయ్ రాయబారిగా 2012 నుంచి 14 వరకు పనిచేశారు. అటు, ఐక్యరాజ్యసమితితో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు. జైళ్లలోని మహిళా ఖైదీల ఆరోగ్య భద్రత కోసం ఎంతో కృషి చేశారు. రాజు వజిరలాంగ్‌కార్న్‌కు ప్రియ పుత్రికైన బబ్రకితియభాను... ధాయ్ తదుపరి వారసురాలిగా చెబుతుంటారు. ఆమెకు కూడా తండ్రి అంటే ఎంతో అభిమానం. ఆయనకు వ్యక్తిగత భద్రతా కమాండ్‌గా అనారోగ్యానికి గురికావడానికి ఏడాది ముందే బాధ్యతలు చేపట్టారు.

Related News