చైనాలో తొలిసారి రోబోలతో ఒలింపిక్స్.. 16 దేశాలు, 280 టీమ్‌లు

Image 1

భవిష్యత్‌లో మనుషుల స్థానంలో రోబోలు వచ్చి చేరతాయని.. చాలామంది టెక్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇక మనిషి చేసే చాలా పనులను రోబోలు చిటికెలో చేసేస్తున్నాయి. రోబోలకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కలగలిపి.. చైనా అనేక కొత్త కొత్త ఆవిష్కరణలను చేస్తోంది. ఈ క్రమంలోనే తాము చేస్తున్న రోబోటిక్ టెక్నాలజీని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు.. తాజాగా రోబోటిక్ ఒలింపిక్స్‌ను చైనా నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌ను తాజాగా చైనా ప్రారంభించింది. ఈ రోబోటిక్ టోర్నమెంట్‌లో 16 దేశాల నుంచి 280 జట్లు పాల్గొన్నాయి. అమెరికా, బ్రెజిల్, జర్మనీ వంటి దేశాలకు చెందిన జట్లతో పాటు.. చైనాకు చెందిన యూనిట్రీ, ఫూరియర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ రోబోటిక్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి.

ఈ రోబోటిక్ ఒలింపిక్స్‌లో రోబోలు ట్రాక్ అండ్ ఫీల్డ్, టేబుల్ టెన్నిస్ వంటి గేమ్స్‌తోపాటు మందులు (ఔషధాలు)ను వేరు చేయడం.. వస్తువులను తీసుకెళ్లడం, క్లీనింగ్ సేవలు వంటి సవాళ్లను కూడా అందులో పాల్గొన్న రోబోలు ఎదుర్కొన్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతున్నపుడు.. రోబోలు ఒకదానికొకటి ఢీకొని కింద పడిపోవడం.. రన్నింగ్ రేస్‌లో కొన్ని రోబోలు సడన్‌గా కుప్పకూలిపోవడం ప్రేక్షకులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ చాలా రోబోలు.. మనుషుల సహాయం లేకుండానే తిరిగి పైకి లేచి మళ్లీ పోటీలో ఉండటం అందరినీ ఆకట్టుకుంది.

రోబోటిక్ ఒలింపిక్స్‌ నిర్వహించడం వల్ల.. ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు అవసరమైన రోబోలను అభివృద్ధి చేయడానికి విలువైన డేటాను సేకరించడంలో సహాయపడుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వల్ల.. ఒకే దగ్గర ఉన్న చాలా రోబోల మధ్య సమన్వయం సాధించేందుకు ఉపయోగపడుతుందని రోబోటిక్ నిపుణులు చెబుతున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లోని ది నేషనల్‌ స్పీడ్‌ స్కేటింగ్‌ ఓవల్‌లో ఈ రోబోటిక్ ఒలింపిక్ గేమ్స్ ప్రారంభించారు. మొదట స్ప్రింట్‌ రన్నింగ్‌, సాకర్‌, బాక్సింగ్‌ వంటి పోటీలను నిర్వహించారు.

చైనా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడేందుకు హ్యూమనాయిడ్ రోబోలను డెవలప్ చేస్తోంది. చైనాలో రోజు రోజుకూ పెరుగుతున్న వృద్ధ జనాభాకు తోడు.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో అమెరికాతో పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని.. హ్యూమనాయిడ్ రోబోలు, రోబోటిక్స్‌ రంగంలో చైనా బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది.

ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా చైనా రోబోటిక్స్ సంబంధిత కార్యక్రమాలను భారీగా చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో మారథాన్, ఒక రోబో సదస్సు, హ్యూమనాయిడ్ రోబోట్‌ల కోసం ప్రత్యేక రిటైల్ ఔట్‌లెట్‌లను ఓపెన్ చేయడం వంటివి ఉన్నాయి.

Related News