న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ (APSTA) ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రవి మందలపుకు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. తొలిసారి అమెరికా పర్యటనకు వచ్చిన ఆయనకు ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో విజయోత్సవ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన అభిమానులు, ఉత్తర అమెరికాలోని ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థలైన తానా (TANA), ఆటా (ATA), నాట్స్ (NATS), మాటా (MATA), టీఫాస్ (TFAS)ల ప్రతినిధులు, ఐటీ సర్వ్ అలయన్స్ సభ్యులు, నాయకత్వం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవి మందలపు మాట్లాడుతూ.. టెక్నాలజీ విప్లవం కారణంగా ప్రపంచం ఒక కుగ్రామంగా మారిందని, సమాచార బదిలీ వేగవంతమైందని పేర్కొన్నారు. ఈ మార్పులను అందిపుచ్చుకుని నూతన అవకాశాలను సృష్టిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రతిభ, సృజనాత్మకత కలిగిన యువతకు సరైన వేదిక కల్పిస్తే ప్రపంచంలోనే ముందువరుసలో నిలుస్తారని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకుని సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపాలని ఆయన కోరారు. రవి మందలపు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.