దసరా పండుగ అంటే విజయానికి ప్రతీక. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండుగగా జరుపుకునే ఈ సందర్భంలో.. అమెరికాలోని తెలుగు సంఘాలు భావితరానికి మన సంస్కృతి గొప్పదనాన్ని పరిచయం చేస్తున్నాయి. ఎడిసన్ నగరంలోని శ్రీ సాయి శివ విష్ణు కల్చరల్ సెంటర్లో సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 25 వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22 (సోమవారం) నుండి అక్టోబర్ 4 (శనివారం) వరకు అత్యంత వైభవంగా జరుపుతున్నారు.
ఉత్సవాల ముఖ్యాంశాలు:
దైనందిన కార్యక్రమాలు: సెప్టెంబర్ 18న కాకడ హారతి, బాబాకు అభిషేకం; సెప్టెంబర్ 19న శివరాత్రికి ప్రత్యేక అభిషేకం, శ్రీ సుదర్శన చక్రం, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. సెప్టెంబర్ 20న శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఉత్సవమూర్తి అభిషేకం, నవగ్రహాలకు అభిషేకం జరిగింది. సెప్టెంబర్ 21న కాకడ హారతి, బాబాకు అభిషేకం, పంచముఖ గణపతికి అభిషేకం నిర్వహించారు.
నవరాత్రి ప్రత్యేక పూజలు: నవరాత్రులలో ప్రతిరోజు (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు) ఉదయం 05:15 గంటలకు కాకడ హారతితో మొదలుపెట్టి, ఉత్సవ మూర్తికి అభిషేకం, దుర్గా సప్తశతి/చండీ పారాయణం, 10:00 గంటలకు సామూహిక కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణంతో పాటు దేవి మాతకు హారతి ఇస్తారు.
సాయంకాల వేడుకలు: సాయంత్రం 06:30 గంటలకు తిరిగి సామూహిక కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం, 07:15 గంటలకు కల్చరల్ ప్రోగ్రామ్, 08:45 గంటలకు శేజ్ హారతి, రాత్రి 09:15 గంటలకు గర్భతో పాటు పంచముఖీ శివ కార్యక్రమం ఉంటుంది.
వారంలో ప్రత్యేక పూజలు: సెప్టెంబర్ 22న పంచముఖి శివకు అభిషేకం, బాలికా పూజ; సెప్టెంబర్ 23న కార్యసిద్ధి హనుమాన్ అభిషేకం, మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, కార్య పూజ; సెప్టెంబర్ 24న ఉత్సవ మూర్తికి అభిషేకం; సెప్టెంబర్ 25న బాబాకు అభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గాజులతో అలంకారణ ప్రత్యేక ఆకర్షణ
ఈ వేడుకల్లో భాగంగా.. అమ్మవారిని భారత్ నుంచి తీసుకొచ్చిన లక్ష గాజులతో అమ్మవారిని అలకరించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారిని గాజులతో అలకరించేందుకు భక్తులు చాలా కృషి చేశారు. గాజులతో ముస్తాబైన అమ్మవారిని దర్శించుకుని భక్తులు ఆశ్చర్యపోవటమే కాదు పులకించిపోతున్నారు. మరోవైపు.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సైతం సాయిదత్తపీఠంలో నిర్వహిస్తున్నారు. సోమవారం రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నారు.
భక్తులందరూ ఈ పవిత్ర దసరా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని శ్రీ సాయిబాబా, శివ విష్ణువుల అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. ఆలయ వేళలు సోమ, మంగళ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. గురు, శని, ఆదివారాల్లో ఉదయం 6:45 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది.