భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూజెర్సీలో పర్యటించారు. యఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూయార్క్ క్లైమెట్ వీక్ సమావేశాలతో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) సమావేశాల్లో పాల్గొనటమే కాకుండా.. స్థానిక మిత్రుల ఆహ్వానం మేరకు మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ ఎనర్జీ అవశ్యకతపై ప్రసంగించారు.
న్యూజెర్సీలోని ఆయన మిత్రుడు, సముద్ర రెస్టారెంట్ అధినేత మంగేష్ చింతమనేని ఆహ్వానం మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రెస్టారెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయ మిత్రులను, మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా పర్యావరణ సమతుల్యత కోసం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎర్నాకులం పార్లమెంటు సభ్యులు హిబీ ఈడెన్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC), టీపీసీసీ ప్రతినిధులు ప్రదీప్ సమల, నరేందర్ రెడ్డి, జ్యోతి గడేళ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
అంతకు ముందు న్యూజెర్సీలోని ది రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన తెలంగాణ చాప్టర్ & కేరళ చాప్టర్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, USA సంయుక్త సమావేశంలో ఎంపీ చామల పాల్గొన్నారు. తన సహచర పార్లమెంట్ సభ్యులు హిబీ ఈడెన్‌తో కలసి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఐఓసీ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ, దివంగత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సెక్రటరీ జనరల్ హరి బచ్చన్ సింగ్ గారికి నివాళులు అర్పించారు. ఐఓసీకి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఐఓసీ సభ్యులు, ఎన్నారైలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల తాను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన క్లైమేట్ వీక్ సమావేశానికి భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. "ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లలో వాతావరణ మార్పు అత్యంత కీలకమైనదిగా, తరచుగా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశంగా నిలుస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
గత రెండు రోజులలో, గ్లోబల్ క్లైమేట్ చేంజ్, డీకార్బనైజేషన్ మరియు పునరుత్పాదక శక్తి వనరుల వైపు మార్పు చెందాల్సిన అవసరంపై దాదాపు తొమ్మిదిన్నర గంటలపాటు తాము చర్చలు జరిపినట్లు ఆయన సమావేశంలో వివరించారు. ఈ చర్చల సారాంశాన్ని ప్రవాస భారతీయులకు తెలియజేశారు.