భార్య వస్త్రధారణ, వంట చేసే తీరుపై భర్త చేస వ్యాఖ్యలు తీవ్ర క్రూరత్వం లేదా వేధింపుల కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ కేసులో భర్తకు, అతడి బంధువులకు శుక్రవారం రోజు విముక్తి కల్పించింది. తాను సరైన విధంగా బట్టలు వేసుకోవడం లేదని, ఎప్పుడూ భర్తకు నచ్చినట్లుగా ప్రవర్తించలేదని, అతడికి నచ్చే విధంగా వంట కూడా సరిగ్గా చేయడం భర్త సతాయిస్తున్నట్లు మహిళ పెట్టిన పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇది ఏమాత్రం తప్పు కాదని.. క్రూరత్వం లేదా వేధింపులుగా తమకు అనిపించడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
భార్యాభర్తలు ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు.. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసి చూసుకుంటున్నారని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దాని వల్లే అన్ని విషయాల్లోనూ గొడవలు పడుతూ.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని న్యాయ పోరాటానికి దిగుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా భార్య వంట చేసినప్పుడు సరిగ్గా లేదని భర్త వంకలు పెట్టడం, ఆమె తనకు నచ్చినట్లుగా వ్యవహరించడం లేదని చెప్పడం, ఆమె కూడా అతడి తీరును ఏమాత్రం సహించకపోవడం ఇందులో భాగమేనని చెప్పింది. అయితే ఇవన్నీ పెద్ద విషయాలేమీ కావని.. వీటిని బూతద్దంలో పెట్టి మరీ చూడాల్సిన అవసరం కూడా ఏమీ లేదని తేల్చి చెప్పింది.
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498ఏ పరిధిలోని క్రూరత్వం భావనలోకి ఇమిడేంత తీవ్రమైన ఆరోపణలు కానప్పుడు.. విచారణను ఎదుర్కోవాలని భర్తను, అతడి కుటుంబ సభ్యులను కోరడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే భార్య వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ఇకపై భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమాభిమానాలు, పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా గడపాలని తెలిపింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అంతా ఆశ్చర్య పోతున్నారు. సాధారణంగా భార్య వేధింపుల కింద కేసు పెడితే.. భర్తలు తప్పించుకోవడం చాలా కష్టం అని, కానీ ఈ కేసులో భర్త తరఫు నుంచి న్యాయస్థానం ఆలోచించడం.. అందులోనూ దంపతులను కలిపేందుకు కృషి చేయడం గమనార్హం అని చెప్పుకొస్తున్నారు.