న్యూజెర్సీ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను అమెరికాలోనూ తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం (సెప్టెంబర్ 21) రోజున న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ హాల్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమంలో 5,000 మందికి పైగా తెలుగువారు పాల్గొని పండుగ శోభను ఇనుమడింపజేశారు.
తెలంగాణ కీర్తిని చాటిన ప్రముఖులు:
ఈ సంబరాలకు తెలంగాణ నుంచి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఫోక్ సింగర్, రేలా రే రేలా విన్నర్ షాలిని.జి, జాతీయ అవార్డు గ్రహీత, గేయ రచయిత కసార్ల శ్యామ్, అలనాటి నటి రోజా రమణి తమ ఉనికితో వేడుకలకు మరింత వన్నె తెచ్చారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు:
వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, పిల్లలు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై, తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని తీసుకువచ్చారు. సాయి దత్త పీఠం పురోహితులు గౌరీ దేవి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. TTA కార్యవర్గ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు. తారిక, తన్విక బృందం (Tara Arts Academy) ప్రదర్శించిన అమ్మవారి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్వేత కొమ్మొజీ వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా, బతుకమ్మ ఆడించి మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. జి. శాలిని తన పాటలు, ఆటలతో అందరినీ ఉర్రూతలూగించి, ఉత్సాహంగా బతుకమ్మ ఆడించారు. మహిళలు, అమ్మాయిలు బతుకమ్మ పాటలకు అద్భుతంగా ఆడుతూ తెలంగాణలో ఉన్నామనే భావన కలిగించారు. ఈ వేడుకలకు 12 అడుగుల ఎత్తైన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని తయారీలో రమణ జలగం, శ్రీమతి దీప జలగం మరియు కమిటీ సభ్యులు కృషి చేశారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ దుస్తుల పోటీలు నిర్వహించి, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారు.
అభినందనలు, కృతజ్ఞతలు:
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు TTA న్యూజెర్సీ టీం సభ్యులు వేడుకల్లో పాల్గొన్న తెలుగువారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు, దాతలకు, మీడియాకు, అలాగే టీటీఏ నాయకత్వం, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, సలహా కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రతినిధుల కృషిని కొనియాడారు.
ఘనంగా సత్కారం:
ఈ కార్యక్రమానికి ప్రధాన దాతగా నిలిచిన డా. మోహన్ రెడ్డి పట్లోళ్లను చిరుధాన్యాలతో చేసిన చిత్రపటంతో సత్కరించారు. ఈ చిత్రపటాన్ని ప్రముఖ చిత్రకారులు విజయ కుమార్ మోక తయారు చేయగా, నర్సింహ పెరుక పర్యవేక్షించారు.
గణనీయంగా కృషి చేసిన నాయకత్వం:
TTA వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, డా. విజయపాల్ రెడ్డి, డా. మోహన్ రెడ్డి పట్లోళ్ల, భరత్ మాదాడి, శ్రీని అనుగు, సంస్థ అధ్యక్షులు నవీన్ రెడ్డి మలిపెద్ది, పూర్వ అధ్యక్షులు వంశీ రెడ్డి మరియు కార్యదర్శి శివారెడ్డి కొల్ల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు ఇంత ఘనంగా జరిగాయి.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ సంబరాలకు వివిధ సంస్థల ప్రముఖులు హాజరయ్యారు. వారిలో శ్రీ పీయూష్ సింగ్ (CGI NY కాన్సుల్), శ్రీధర్ చిల్లర (CEO – ManaTV & TV5 USA), ఉపేంద్ర చివుకుల, రఘు శర్మ శంకరమంచి (సాయి దత్త పీఠం), దాము గేదెల (కమ్యూనిటీ లీడర్) ఉన్నారు.
కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించినవారు:
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో టీటీఏ న్యూజెర్సీ బృందం ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరిలో మోహన్ రెడ్డి పట్లోళ్ల, శివారెడ్డి కొల్ల, నర్సింహ పెరుక, అరుణ్ రెడ్డి అర్కాల, సుధాకర్ ఉప్పల, నరేందర్ యారవ, ప్రశాంత్ నలుబంధు, సాయిరామ్ గాజుల, రాజా నీలం, దీప జలగం, సాయి గుండూర్ మరియు అనేకమంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు.
ఈ సంబరాల తర్వాత నరేందర్ యారవ ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీటీఏ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.