
అమెరికా ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా విధించిన షట్‌డౌన్‌తో దాదాపు నెల రోజుల పాటు నిలిచిపోయిన వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తాజాగా పునరుద్ధరించారు. ఈ నిర్ణయం ద్వారా హెచ్ 1బీ వీసా దరఖాస్తుదారులు, అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు ఈ నిర్ణయం భారీ ఊరటను ఇచ్చినట్లయింది. అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) పరిధిలోని విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం (ఓఎఫ్ఎల్‌సీ).. తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. అమెరికన్ కాంగ్రెస్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగానే ముఖ్యమైన వీసా సేవలు కూడా ఆగిపోయాయి.
హెచ్-1బీ దరఖాస్తుల కోసం ఉపయోగించే ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (ఎఫ్ఎల్ఏజీ) పోర్టల్, సీజనల్‌జాబ్స్.డీఓఎల్.జీవోవీ (SeasonalJobs.dol.gov) వెబ్‌సైట్‌లు తిరిగి పనిచేయడం ప్రారంభించాయని డీఓఎల్ వెల్లడించింది. అంతేకాకుండా హెచ్-1బీ వీసాలకు అవసరమైన లేబర్ కండీషన్ అప్లికేషన్స్ (ఎల్‌సీఏ), గ్రీన్ కార్డుల మొదటి దశ ప్రక్రియ అయిన ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్(పీఈఆర్ఎమ్) లేబర్ సర్టిఫికేషన్లు రెండింటి ప్రాసెసింగ్‌ను కూడా విదేశీ కార్మిక ధ్రువీకరణ కార్యాలయం తిరిగి ప్రారంభించిందని తెలిపింది. ఇక హెచ్ -1బీ వీసాలు మంజూరు చేసే యజమానులు ఇప్పుడు కొత్త ఎల్‌సీఏలను సమర్పించవచ్చని.. దాంతోపాటు ఇప్పటికే చేసిన అప్లికేషన్ల స్టేటస్ పర్యవేక్షించవచ్చని వెల్లడించింది.
భారతీయులపై ఎక్కువ ప్రభావం
ఇక అమెరికా షట్‌డౌన్ కారణంగా హెచ్ 1బీ వీసాలు , గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిచిపోవడం వల్ల భారతీయ నిపుణులే అత్యధికంగా ప్రభావితం అయ్యారు. అమెరికా జారీ చేసే మొత్తం హెచ్-1బీ వీసాదారుల్లో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉండటం గమనార్హం. సరైన సమయంలో ఎల్‌సీఏ, పీఈఆర్ఎమ్ ఆమోదాలు లభించకపోతే.. వీసా గడువు ముగిసిపోయే ప్రమాదం ఉన్నందున చాలా మంది భారతీయ నిపుణులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. అయితే ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు కొంత సమయం పడుతుందని అక్టోబర్ 31వ తేదీన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటం, వివిధ కంపెనీల నుంచి కొత్త అప్లికేషన్లు పెరిగే అవకాశాలు ఉన్నందున.. సాధారణ ప్రాసెసింగ్ సమయానికి ఎక్కువ సమయం పట్టవచ్చని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఉదాహరణకు 2024 మార్చిలో అప్లై చేసుకున్న కొన్ని కేసులు 2025 జూలై నాటికి కూడా పరిష్కారం కాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రకటన అమెరికన్ కంపెనీలు, అక్కడ పనిచేస్తున్న భారతీయ నిపుణులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ.. పెండింగ్ కేసులను పరిష్కరించడానికి అధికారులు ఎంత వేగంగా పనిచేస్తుందో వేచి చూడాల్సిందే.