
తాజాగా అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులు డెమోక్రాటిక్ పార్టీ తరపున సత్తా చాటారు. న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మందానీ విజయం సాధించిన నేపథ్యంలో.. మరో తెలుగు బిడ్డ, భారత సంతతికి చెందిన మహిళ గజాలా హాష్మీ వర్జీనియా రాజకీయాల్లో నూతన చరిత్ర సృష్టించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని అయిన గజాలా హాష్మీ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో ఆమె వర్జీనియా రాష్ట్రంలో ఈ కీలక పదవిని దక్కించుకున్న తొలి భారత సంతతి మహిళగా, అలాగే వర్జీనియా సెనేట్‌లో పని చేసిన మొట్ట మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్‌గా తన చారిత్రక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
హైదరాబాద్‌తో గజాలా అనుబంధం
గజాలా హాష్మీకి భారత దేశంతో.. ముఖ్యంగా హైదరాబాద్‌తో బలమైన అనుబంధం ఉంది. ఆమె 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ, తన్వీర్ హాష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపిన గజాలా.. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గజాలా విద్యార్హతలు కూడా చాలా ఉన్నతమైనవి. ఆమె జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందారు.ఆ తర్వాత పెళ్లి చేసుకున్న గజాలా హష్మి.. 1991లో రిచ్‌మండ్ ప్రాంతానికి మారారు. అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పని చేసి.. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో ఆమె చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు.
ఆ తర్వాత 2024లో ఆమె సెనేట్ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నిక అయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టడం ఆమె రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం కాగా.. అంతా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఓ హైదరాబాదీ మహిళ అమెరికాలో అంత అత్యున్నత పదవిని సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని.. భారత సంతతి అమెరికన్లు చెబుతున్నారు.