భారత్ చెప్పిందే నిజం.. ట్రంప్‌కు షాకిచ్చిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి

Image 1

ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు తాను కృషి చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. గత కొంతకాలంగా సొంత డబ్బా కొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న 7 యుద్ధాలను తానే మధ్యవర్తిత్వం వహించి ఆపేసి శాంతిని నెలకొల్పినట్లు మొదట ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఆ తర్వాత తాను మూడే యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను తానే ఆపినట్లు ట్రంప్ తరచూ చెప్తూ వస్తున్నారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరగకుండా.. తాను మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే భారత్ మాత్రం.. తాము ఎవరి మధ్యవర్తిత్వంతో దాడులు ఆపలేదని.. పాకిస్తాన్ చేసిన విజ్ఞప్తి మేరకే ఆపేసినట్లు పదే పదే స్పష్టం చేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం దానికి క్రెడిట్ తనదేనని మొండి పట్టు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. మరోసారి ట్రంప్‌ చెప్పింది తప్పు అని స్పష్టంగా చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని అంగీకరించారు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత్-పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ విషయంలో మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ పదే పదే చేస్తున్న వాదనలు తప్పని తేలింది.

భారత్, పాక్ మధ్య జరిగిన దాడులకు సంబంధించిన అంశంపై స్పందించిన ఇషాక్ దార్.. భారత్ ఎన్నడూ ఈ వి,యంలో మధ్యవర్తిత్వం వహించేందుకు మూడో పక్షాన్ని ఒప్పుకోలేదని వెల్లడించారు. తాము భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. భారత్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా.. గతేడాది భారత్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా ద్వారా పాకిస్తాన్‌కు ఒక ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో జూలై 25వ తేదీన వాషింగ్టన్‌లో తాను భేటీ అయినపుడు.. పాక్ చేసిన ఈ ప్రతిపాదనను భారత్ తిరస్కరించినట్లు చెప్పారని ఇషాక్ దార్ వెల్లడించారు. పాకిస్తాన్‌తో ఉన్న ఈ సమస్యను ద్వైపాక్షిక అంశమని భారత్ గట్టిగా చెబుతోందని తనతో మార్కో రూబియో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

మరోవైపు.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌తో పాకిస్తాన్‌ భారీ ఎత్తున నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే భారత్ చేస్తున్న దాడులను తట్టుకోలేని పాకిస్తాన్.. కాల్పుల విరమణ కోసం తమను వేడుకుందని భారత్ స్పష్టం చేసింది. అయితే.. అది అంగీకరించని ట్రంప్.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తానే మధ్యవర్తిత్వం వహించి తగ్గించానని.. లేకపోతే రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వచ్చి ఉండేదని ఇప్పటికే అనేకసార్లు, అనేక వేదికలపై వెల్లడించారు.

ట్రంప్ వాదనను భారత్ ఖండించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన పాటే తానే పాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పాక్ మంత్రి ఇషాక్ దార్ చేసిన ప్రకటన.. ట్రంప్ చేస్తున్న వాదన తప్పు అని మరోసారి స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉన్న అన్ని రకాల సమస్యలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని మొదటి నుంచీ చెబుతున్న భారత్ దీర్ఘకాలిక విధానానికి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇచ్చాయి.

Related News