ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రూటే సెపరేటు.. అందరూ ఎడ్డెం అంటే.. ఆయన తెడ్డెం అంటారు. ఇక, ఉత్తర కొరియా ప్రజలు ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? అనేది కూడా ఆయనే శాసిస్తారు. తాజాగా, ఆయనకు ఐస్ క్రీమ్ మీద ఎందుకో కోపం వచ్చింది. దీంతో వెంటనే దాని పేరునే మార్చేశారు. సాంస్కృతిక నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కిమ్ సర్కారు ప్రకటించింది. ఇక, పనిలోపనిగా మరికొన్నింటి పదార్థాల పేర్లను కూడా మార్చేయడం గమనార్హం. ఉత్తర కొరియాలో నియంత పాలన కొనసాగుతోన్న విషయం తెలిసిందే.ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా గుర్తుపట్టే పేరు ‘ఐస్‌క్రీమ్’ కానీ, ఉత్తరకొరియా నియంతకు ఈ పేరు నచ్చలేదు. దీనివల్ల విదేశీ ప్రభావం తమ ప్రజలపై పడుతుందని కిమ్ అనుమానించారు. ఇక, వెంటనే తమ భాషలో ‘ఎసుకిమో’గా పేరు మార్చేశారు. కాకుంటే ‘ఇయోరియెంబోసెంగి (ఐసు మిఠాయి)’గా పిలవాలని ఆయన మినహాయింపు ఇచ్చినట్టు డెయిలీ ఎన్‌కే పత్రిక వెల్లడించింది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా, అమెరికా సహా పశ్చిమ దేశాల పదాలు వినియోగాన్ని పూర్తిగా తొలగించడమే దీని లక్ష్యంగా పేర్కొంది.
ఈ క్రమంలో టూరిస్ట్ గైడ్‌లకు ప్రస్తుతం వాన్సన్ సహా పలు ప్రదేశాల్లో శిక్షణ ప్రారంభించింది. ఆగస్టు 21 నుంచి మొదలైన ఈ శిక్షణలో భాగంగా విదేశీ టూరిస్ట్‌లతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్ పదాలు రాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో చెబుతున్నారట. దీంతో విస్తుపోవడం గైడ్లు వంతయ్యింది. ఇంగ్లీష్ మాట్లాడకుంటే విదేశీ పర్యటకులను ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతామని తలలు పట్టుకొంటున్నారు. కానీ, అధ్యక్షుడు ఆదేశించాక చేయడం తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో ట్రెయినింగ్‌కు హాజరవుతున్నారు.
ఆర్కిటిక్, అలాస్కా, కెనడా, గ్రీన్‌ల్యాండ్, సైబీరియా ప్రాంతాల్లో ఎస్కిమో అనే జాతి ఉన్న సంగతి తెలుసు. ఉత్తర కొరియా ‘ఎసుకిమో’ పదం కూడా దానికి దగ్గరగా ఉండటంతో గందరగోళం నెలకొంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హామ్‌బర్గ్ పేరును కూడా మార్చేసిన కిమ్... ఉత్తర కొరియాలో ఇకపై ‘డాజిన్-గోగి గియోపాంగ్’గా పిలవాలని ఆదేశించారు. దీని అర్ధం గ్రౌండ్ బీఫ్‌తో రెండు బ్రెడ్లు. కారియోకి మెషిన్ల పేరును కూడా ఆయన మార్చేశారు. తమదేశంలో ఉన్నప్పుడు టూరిస్ట్‌లు దక్షిణ కొరియా పదాలు మాట్లాడకుండా నివారించడానికే ఈ నిర్ణయం తీసుకొన్నారు.
ఇటీవల కంగ్వాన్ ప్రావిన్సుల్లో వాన్సన్ అనే విలాసవంతమైన బీచ్ రిసార్ట్ హబ్‌ను ఉత్తర కొరియా అభివృద్ధి చేసింది. ఓ అధికారి మాట్లాడుతూ.. విదేశీ మాయలో తమ పౌరులు పడకుండా వారిని రక్షిస్తూ పర్యటకాన్ని ప్రోత్సహించడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. కానీ, కిమ్ నిర్ణయాలతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, వారికి బయట ప్రపంచంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.