
మొన్న బీహార్ కుర్రాడు అభిషేక్ కుమార్ గూగుల్‌లో రూ.2.07 కోట్ల ప్యాకేజీ సాధిస్తేనే దేశమంతా మాట్లాడుకుంది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేశాడు మన తెలుగోడు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకు చెందిన యువకుడు సాత్విక్ రెడ్డి ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో గూగుల్‌లో జాబ్ కొట్టాడు! అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొనుదుల రమేశ్‌రెడ్డి, అంబిక దంపతుల కుమారుడే ఈ సాత్విక్ రెడ్డి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే ఐఐటీల నుంచే రావాలనే రూల్‌ను పక్కనపెట్టి, సాత్విక్ తన టాలెంట్‌ను చూపించాడు.అమెరికాలోని న్యూయార్క్, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలో తన ఇంజినీరింగ్‌ను పూర్తి చేసిన వెంటనే, గూగుల్ నుంచి ఈ అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ఎంత ఆఫర్ అంటే... ఏకంగా రూ.2.25 కోట్లు!
అంటే, రోజుకు దాదాపు రూ.60 వేలకు పైనే! ఈ డ్రీమ్ జాబ్‌తో సాత్విక్ ఇప్పుడు కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో కొలువు చేయబోతున్నాడు. సాత్విక్ సాధించిన ఈ ఘనత గురించి తెలియగానే పట్టణంలోని ప్రముఖులు, అతని మిత్రులు ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. తన సొంత టాలెంట్, సరైన ఫోకస్‌తో 2.25 కోట్ల జాబ్ కొట్టి... మన తెలుగు యువత సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపించాడు ఈ యువకుడు. టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ప్రస్తుతం భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్త మన తెలుగోడే.
కాగా, ఈ ఏడాది మే నెలలో విజయవాడకు చెందిన విద్యార్థికి అమెజాన్‌లో కోటిన్నర ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిన సంగతి తెలిసిందే. పోరంకికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఆరేపల్లి వెంకటసాయి ఆదిత్య అమెజాన్ కంపెనీలో డెవలప్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. ఆదిత్యకు అమెజాన్ రూ.కోటి యాభై లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్ పూర్తి చేసిన వెంటనే అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో అవకాశం అందుకున్నాడు. ప్రస్తుతం అమెరికాలో భారతీయ విద్యార్థులకు కష్టకాలం నడుస్తోంది. ట్రంప్ విధానాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో వరుసగా భారతీయులు ఆఫర్లను అందుకోవడం కొంత ఊరట కలిగించే అంశం.