న్యూజెర్సీలో ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 16వ వార్షికోత్సవం

Image 1

తెలుగు పీపుల్ ఫౌండేషన్ 16వ వార్షికోత్సవం శనివారం (డిసెంబర్ 14న) సాయంత్రం న్యూజెర్సీలో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు సుమంగళి, ప్రసాద్ సింహాద్రి, తరుణ్ పాల్గొని.. తమ పాటలతో అలరించారు. 2008లో ప్రారంభమైన తెలుగు పీపుల్ ఫౌండేషన్ జర్నీ గురించి వివరించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు మొత్తంగా 500 మందికి పైగా కాలేజీ విద్యార్థులకు సాయం చేయగలిగినట్టు ఫౌండేషన్ నిర్వాహకులు ప్రసాద్ కునిశెట్టి తెలిపారు. ఒకవైపు చదువుకుంటూ మరో పక్క బతుకుదెరువు కోసం గొర్రెలు కాచుకోవల్సిన పరిస్థితిలో ఉన్న విద్యార్థి ఒకరైతే, తండాలో పూరింటిలో ఉంటూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించిన విద్యార్థి మరొకరు.. ఇలా ప్రతి ఒక్క విద్యార్థిదీ ఒక కథ. సినిమా తీయడానికి పనికివచ్చే కథ. ప్రతి విద్యార్థి ఒక కథానాయకుడు, నాయిక అంటూ వివరించారు.

Image 3

భారత దేశంలోని అన్ని ప్రధాన ఐఐటీలలో తెలుగుపీపుల్ ఫౌండేషన్ విద్యార్థులు ఉన్నారని మా అధ్యక్షులు కొత్త కృష్ణ స్టేజీ మీద తమ ప్రసంగంలో చెప్పినపుడు తనకు నిజంగా మహదానందం కలిగిందని ప్రసాద్ కునిశెట్టి తెలిపారు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఫౌండేషన్‌లో నిరంతరం కేవలం విద్యార్థుల కోసం పనిచేస్తున్న టీం సభ్యులు, దాతలు, సహాయకులు, స్పాన్సర్లు అందరూ గర్వపడేలా మా విద్యార్థులు విజయాలను సాధిస్తున్నారని తెలిపారు.

Image 5

సుమారు 35 మంది యువ వాలంటీర్లు అమెరికాలో విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చే బాధ్యతను తీసుకున్నారని తెలిపారు. దాతలు, యువత, వలంటీర్లలో తెలుగు సంతతికి చెందిన వారే కాక మిగిలిన వారు కూడా ఉండడం ఫౌండేషన్ చేస్తున్న అద్వితీయమైన సేవలకు నిదర్శనమన్నారు.

Image 7

ఫండ్ రైజింగ్ డైరెక్టర్ ప్ర‌వీణ్ గూడురు, అడ్వైజ‌ర్ టీపీ శ్రీనివాస్, ప్ర‌సాద్ కునిశెట్టి మాట్లాడుతూ.. విద్యార్ధులకు అండగా నిలుద్దాం.. విరాళాలను సమీకరించుదామంటూ పిలుపునిచ్చారు. ఈ వేడుకకు వివిధ సంస్థలు స్పాన్సర్‌గా వ్యవహరించాయి. ముఖ్యంగా Arohak, MATA, ISSI, GAIFA, IT America, BB Law Group తదితర కంపెనీలు ప్ర‌ధానంగా సహకరించాయి. మాటా, టీఫాస్, నాట్స్ సంఘాల నాయకులు పాల్గొని తెలుగు పీపుల్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.

అద్భుతమైన క్వాలిటీ, రుచితో భోజన సదుపాయాలు సమకూర్చిన వివిధ రెస్టారెంట్ల యాజమాన్యాలకు, డైనింగ్ హాలు వాలంటీర్లకు ఫౌండేషన్ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ కార్యక్రమానికి ఉచితంగా తమ వంతు సహాయం అందించడమే కాక, విరాళాలు కూడా ఇచ్చిన గాయనీ గాయకులకు, మీడియా, ఫొటో గ్రాఫర్లకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం గురించి TeluguPeople.org ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు treasurer@telugupeople.org కు Zelle చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రతి రూపాయి, డాలరు విద్యార్థుల కోసమే ఖర్చు చేస్తామని హామీ ఇస్తున్నట్టు ప్రసాద్ కునిశెట్టి తెలిపారు.

Related News