తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. ఇప్పుడు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపైన కూడా ఈడీ కేసు నమోదు చేయటం గమనార్హం.
అయితే.. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్‌తో ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాయగా.. 13 (1)A, 13 (2) పీసీ యాక్ట్‌తో పాటు 409, 120B సెక్షన్ల కింద కేటీఆర్‌తో పాటు అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసులు నమోదు చేసింది. దీంతో.. కేటీఆర్ అరెస్టు ఖాయమని, ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని.. కనీసం బెయిల్ కూడా రాదంటూ ప్రభుత్వం పెద్దలు రకరకాలుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఏసీబీతో పాటు ఈడీ కూడా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయటంతో సర్వత్రా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే.. కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఏసీబీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో విచారణ మాత్రం కొనసాగించవచ్చని.. ఆ విచారణకు కేటీఆర్ సహకరించాలంటూ ఆదేశించింది. మరోవైపు.. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది.
అయితే.. హైదారాబాద్‌లో ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి అక్టోబరు 18న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ చెల్లింపులతో ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో.. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం జరిగిందని.. ఆయన అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో.. కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. కాగా.. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి.