"మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి" అనే స్లోగన్‌తో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. మార్పు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మొన్నటివరకు ఉన్న టీఎస్ (TS)ను టీజీ(TG)గా మార్చేసింది. ఆ తర్వాత.. గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చుతూ.. సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. వీటితో పాటు నంది పేరుతో ఇచ్చి అవార్డులను.. గద్దర్ అవార్డులుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో.. పలు యూనివర్సిటీల పేర్లను కూడా మార్చాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇప్పటికే కోఠి మహిళల కళాశాల పేరును చాకలి ఐలమ్మ మహిళల విశ్వవిద్యాలయంగా మార్చేసింది. దాంతో పాటు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి.. తెలంగాణ వైతాళికుడిగా పేరొందిన.. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు కూడా. కాగా.. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా స్పందించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. తన స్పందన తెలియజేశారు.
హైదరాబాద్‌లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిన పొట్టి శ్రీరాములు పేరును మార్చే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీని కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ తరువాతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని చంద్రబాబు గుర్తు చేశారు.