అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్‌గా చేసిన పుష్ప 2 సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కేవలం ఆరు రోజుల్లోనే సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మొదటి వీక్ సహా, లాంగ్ రన్‌లో ఈ సినిమా రాబట్టే వసూళ్ల నెంబర్స్‌పై అందరి దృష్టి ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోతున్న ఈ సమయంలో తెలుగు హీరో వసూళ్లలో రికార్డులు బ్రేక్ చేయడం మామూలు విషయం కాదు. ఈ విజయంలో నార్త్ ఇండియా కలెక్షన్స్ అత్యంత కీలకం. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ రాబడుతున్న కలెక్షన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి.
సినిమా భారీగా వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఢిల్లీలో థాంక్యూ ఇండియా మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆ మీట్‌లో నార్త్ ఇండియా రాష్ట్రాల డిస్టిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, బయ్యర్లు పాల్గొన్నారు. యూపీ ఎగ్జిబ్యూటర్ మాట్లాడుతూ తన పాతిక ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి కలెక్షన్స్ చూడలేదు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా సుకుమార్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు. నిర్మాతలు మాట్లాడుతూ సినిమాను ఇంత భారీ సక్సెస్ చేసినందుకు థాంక్యూ చెప్పడంతో పాటు, సినిమాను భారీ ఎత్తున విడుదల చేసినందుకు బయ్యర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ... థాంక్యూ ఇండియా మా సినిమాను ఇంతటి సక్సెస్ చేసినందుకు, ఇది లవ్ కాదు వైల్డ్ లవ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేమికులకు కృతజ్ఞతలు. రికార్డ్‌లు అనేవి శాశ్వతం కాదు, పుష్ప 2 రికార్డ్‌లు వచ్చే సమ్మర్‌కి బ్రేక్ కావచ్చు. రికార్డులు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండి పోవు. ఎప్పుడూ మారుతూ ఉంటాయి. కానీ ప్రేక్షకుల అభిమానం శాశ్వతంగా ఉంటుంది. వారు ఈ సినిమాపై చూపించిన ప్రేమ, అభిమానాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను అంటూ బన్నీ అన్నారు. ఈ విజయాన్ని మూడు నెలలు ఎంజాయ్ చేస్తాను, వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రికార్డులు బ్రేక్ కావాలని నేనే కోరుకుంటున్నాను.. అంటూ బన్నీ చెప్పారు.
సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలి అంటే ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల రికార్డ్‌లు బద్దలు కావాల్సిందే. అప్పుడే సినిమా ఇండస్ట్రీ పురోగతి సాధిస్తున్నట్లుగా ఉంటుంది. కనుక తన రికార్డ్‌లు బ్రేక్ అయినా బాధ పడను అని, ముఖ్యంగా తన సినిమాల కంటే పెద్ద సినిమాలు వచ్చి మంచి వసూళ్లు సాధిస్తే సంతోషిస్తాను అన్నట్లుగా బన్నీ చెప్పుకొచ్చారు. థాంక్యూ ఇండియా మీట్‌లో పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు హాజరు కావడంతో పాటు, అన్ని ఏరియాల బయ్యర్లు హాజరు అయ్యారు. దేశవ్యాప్తంగా సాధిస్తున్న వసూళ్ల నేపథ్యంలో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి 2, దంగల్ రికార్డుల బ్రేక్ విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.