ఎన్నికల్లో ఘన విజయం.. ఆంధ్రా అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

Image 1

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గానూ.. సాధారణ మెజార్టీకి అవసరమైన 270 మార్క్‌ను ట్రంప్ సాధించారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెషన్ సెంటర్‌లో మాట్లాడుతూ.. ఇది గొప్ప విజయమని, ఇంతట ఘనవిజయం అందించినందుకు అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. స్వింగ్ రాష్ట్రాల్లో విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా ఇలాంటి గెలుపు ఎన్నడూ చూడలేదని, అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని అన్నారు. ఎన్నికల సమరంలో రిపబ్లికన్‌లు గొప్పగా పోరాటం చేశారన్నారు.

రిపబ్లికన్లకు 315 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. పాపులర్ ఓట్లలోనూ రిపబ్లికన్‌ పార్టీ హవా కొనసాగిందని చెప్పారు. ఈ సందర్భంగా వైస్-ప్రెసిడెంట్ అభ్యర్ధి, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా చిలుకూరిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. వేదికపై మెలానియా ట్రంప్ పక్కన నిల్చున్న వాన్స్, ఉషాలను చూస్తూ.. ‘నేను ముందుగా వైస్-ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్‌.. ఆయన సతీమణి, అద్బుతమైన మహిళ ఉషా చిలుకూరి వాన్స్‌కు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఎవరూ ఊహించని ఆటంకాలు అధిగమించి మేము విజయం సాధించి, ఒక కారణం కోసం చరిత్ర సృష్టించాం.. ..ఇది మన దేశం మునుపెన్నడూ చూడని రాజకీయ విజయం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అలాగే, తనకు తొలి నుంచీ మద్దతుగా ఉన్న ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌ను ఆయన ప్రసంశలతో ముంచెత్తారు. ఇక, ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ... జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, కన్సాస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. అటు, స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌నే ప్రజలు ఆదరించారు. ఇక్కడ తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపితే వారికే అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఇస్పుడు కూడా ఇదే సంప్రదాయం కూడా కొనసాగింది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు కమలా హ్యారిస్‌, ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని భావించారు. కానీ,సమయం గడిచేకొద్దీ ట్రంప్ హవా కొనసాగింది. దీంతో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related News