డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లో భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు.. ఎవరెవరు ఉన్నారంటే?

Image 1

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్.. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే దీనికి ఇంకా రెండు నెలల సుదీర్ఘ సమయం ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ 2.0 హయాంలో ఉండే తన కేబినెట్‌ను, కీలక పదవులను ఎవరికి ఇవ్వాలి అనేదానిపై ఇప్పటి నుంచే ట్రంప్.. ఒక క్లారిటీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన కేబినెట్‌లో ఉండే రిపబ్లికన్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అధికారం చేపట్టేందుకు తన టీమ్‌ను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఒక స్పెషల్ టీమ్‌ను డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ టీమ్‌లో అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్.. ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్‌‌‌లతోపాటు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు తులసీ గబార్డ్, ట్రంప్ సన్నిహితంగా ఉండే బిజినెస్‌మెన్ హోవార్డ్ లుట్నిక్.. గతంలో ట్రంప్ హయాంలో పనిచేసిన లిండా మెక్‌మాహన్ ఉన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీలోని కొందరు భారత సంతతి నేతల పేర్లు కూడా ట్రంప్ క్యాబినెట్ స్క్రీనింగ్ టీమ్ పరిశీలనలో ఉన్నాయి.

  • వివేక్ రామస్వామి...
  • ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌తో భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి పోటీపడ్డారు. అయితే ఈ పోటీలో వివేక్ రామస్వామి చివరిదాకా కొనసాగకుండా మధ్యలోనే తప్పుకున్నారు. తన మద్దతును ట్రంప్‌కు ప్రకటించి, అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగారు. ఇక వివేక్ రామస్వామికి అమెరికాలో బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. వివేక్ రామస్వామికి.. అమెరికా హోం శాఖ (హోంల్యాండ్ సెక్యూరిటీ)ని ట్రంప్ కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది.

    • నిక్కీ హేలీ..
    • మాజీ సౌత్ కరోలినా గవర్నర్, భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు అయిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితురాలు. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఇక ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ కూడా డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడ్డారు. అయితే ఆమె కూడా వివేక్ రామస్వామి లాగానే.. పోటీ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు.

      • కశ్యప్ పటేల్..
      • భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ అమెరికాలో ఒక లాయర్. డొనాల్డ్ ట్రంప్‌కు వీర విధేయుడు అనే ట్యాగ్ కూడా కశ్యప్ పటేల్‌కు ఉంది. అందుకే ఈసారి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ - సీఐఏ చీఫ్ పదవిని కశ్యప్‌ పటేల్‌కు ఇస్తారనే ప్రచారం ఇప్పుడు అమెరికాలో జోరుగా సాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2019 ఫిబ్రవరిలో అమెరికా జాతీయ భద్రతా మండలిలోని ఉగ్రవాద నిరోధక విభాగం డైరెక్టర్‌గా కశ్యప్‌ పటేల్ పనిచేశారు.

        • తులసీ గబార్డ్..
        • మరో భారత సంతతికి చెందిన నాయకురాలు అయిన తులసీ గబార్డ్.. గతంలో డెమొక్రటిక్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలోకి వచ్చిన తులసీ గబార్డ్.. డొనాల్డ్ ప్రస్తుతం ట్రంప్ టీమ్‌లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ప్రచార వ్యూహాలను అందించిన స్పెషల్ టీమ్‌లో తులసీ గబార్డ్ కూడా సభ్యురాలు. ఇక తనకు విధేయంగా ఉన్న తులసీ గబార్డ్‌కు ఏదైనా బాధ్యతను ట్రంప్ అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

          • బాబీ జిందాల్..
          • భారత సంతతికి చెందిన నేత, లూసియానా రాష్ట్ర మాజీ గవర్నర్ బాబీ జిందాల్‌కు డొనాల్డ్ ట్రంప్ 2.0 కేబినెట్‌లో బెర్తు దక్కే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాబీ జిందాల్‌కు ఆరోగ్య, మానవ సేవల శాఖను కేటాయిస్తారనే పేర్కొంటున్నారు. ప్రస్తుతం బాబీ జిందాల్.. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లోని ‘సెంటర్ ఫర్ ఎ హెల్తీ అమెరికా’ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

            Related News