అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అయితే ట్రంప్ విజయంలో ట్విటర్, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ పాత్ర ఎంతో ఉందని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని విక్టరీ స్పీచ్‌లో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం విశేషం. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్‌కు తగిన గౌరవం, పదవి దక్కనున్నాయి అని అమెరికాలో రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఎన్నికలకు ముందే.. తాను గెలిస్తే మస్క్‌కు మంచి పదవి కట్టబెడతానని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎలాన్ మస్క్ కుమార్తె వివియాన్ ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా సంచలన విషయం వెల్లడించారు. ట్రంప్ రాకతో తన లాంటి వారికి అమెరికాలో భవిష్యత్ కనిపించడం లేదని.. అందుకే దేశాన్ని వీడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ కుమార్తె వివియాన్ జెన్నా విల్సన్ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన థ్రెడ్స్‌లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. వివియాన్ జెన్నా విల్సన్ పురుషుడిగా పుట్టినా.. ఆ తర్వాత లింగ మార్పిడి చేసుకుని మహిళగా మారాడు. అది ఎలాన్ మస్క్‌కు నచ్చలేదు. అయితే తాజాగా ట్రంప్ రాకతో అమెరికాలో తన లాంటి ట్రాన్స్‌జెండర్లకు భవిష్యత్తు కనిపించడం లేదని ఆమె తెలిపారు. తాను దేశం విడిచి వెళ్లిపోవాలని ఎంతో కాలంగా అనుకున్నానని.. కానీ ఇప్పుడు ట్రంప్ గెలుపుతో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలనే కోరిక మరింత బలపడిందని పేర్కొన్నారు.
కానీ డొనాల్డ్ ట్రంప్ 4 ఏళ్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడి పదవిలో ఉంటాడని తెలుసని.. అంతేకాకుండా తాను గెలిస్తే లింగమార్పిడి నిబంధనలను అమలు చేస్తానని గతంలో ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అవన్నీ ఇప్పటికిప్పుడు అమలు కావని కూడా తనకు తెలుసని వెల్లడించారు. ట్రంప్ మాత్రమే అమెరికా అధ్యక్షుడు కావాలని.. అతడిని పిచ్చిగా అభిమానించి ఓట్లు వేసిన అమెరికా ప్రజలు ఎప్పటికీ ఇదే సమాజంలో ఉంటారని వివియాన్ జెన్నా విల్సన్ తెలిపారు. అయితే సమీప భవిష్యత్తులో ట్రాన్స్ జెండర్లపై అమెరికా ప్రజల మనస్తత్వంలో మార్పు వచ్చే అవకాశమే లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల ట్రాన్స్ జెండర్లకు అమెరికాలో భవిష్యత్తు లేదనే స్పష్టత వచ్చిందని తెలిపారు.
ఇక అమెరికాను వీడుతున్నట్లు వివియాన్ చేసిన పోస్ట్‌పై ఎలాన్ మస్క్ కూడా ట్విటర్‌లో స్పందించారు. తన కుమారుడిని ఓక్ మైండ్‌సెట్ అనే బ్యాక్టీరియా చంపేసిందని.. మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్‌పై స్పందించిన వివియాన్.. తన తండ్రి ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్‌ను థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడు కూడా తన బిడ్డకు ఏదో సోకింది.. అందుకే తనను తన బిడ్డ ద్వేషిస్తోంది అంటూ మళ్లీ పాత కథలే చెప్పొద్దని.. వాటిని పట్టించుకోవద్దని తెలిపారు. ఏ రకంగా చూసినా తానే బాధితురాలిని అని వివియాన్ విల్సన్ పేర్కొన్నారు.
ఎలాన్ మస్క్ మొదటి భార్యకు పుట్టిన ఆరుగురి సంతానంలో వివియాన్ విల్సన్ కూడా ఒకరు. అయితే అబ్బాయిగా పుట్టిన వివియాన్.. అమ్మాయిగా మారేందుకు లింగమార్పిడి చేయించుకున్నాడు. అయితే ఈ నిర్ణయం ఎలాన్ మస్క్‌ను తీవ్రంగా బాధించింది. ఎంత చెప్పినా వినకుండా వివియాన్ లింగ మార్పిడి చేసుకోవడంతో ఆమెను ఎలాన్ మస్క్ దూరం పెట్టారు. దీంతో 2022 నుంచి ఎలాన్ మస్క్‌తో విడిపోయి వివియాన్ ఒంటరిగా జీవిస్తున్నారు. అప్పటినుంచి తన తండ్రికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.