‘అమెరికా ఫస్ట్’ ట్రంప్ ఎజెండా.. H1-B వీసా రూల్స్ మరింత కఠినతరం!

Image 1

ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించి, రెండోసారి అధ్యక్షుడు కానుండటంతో భారత్, అమెరికా సంబంధాలు, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ, ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాను అమలు చేస్తే ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి భారతీయ ఎగుమతులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయవచ్చని, భారతీయ ఐటీ సంస్థల ఖర్చులు, వృద్ధిపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు.

భారత ఐటీ ఎగుమతి ఆదాయాలలో 80 శాతానికి పైగా అమెరికా నుంచే లభిస్తుంది. వీసా విధానాలలో మార్పులు వల్ల ఇది ప్రభావితమవుతుంది. ఐటీలో భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. 190 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యాన్ని కలిగి ఉంది. భారత్, సహా ఇతర దేశాలపై చైనాకు మించిన సుంకాలను ట్రంప్ విధించే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) ప్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ ( Ajay Srivastava) అన్నారు. గతంలో భారత్ అతిపెద్ద పన్ను దుర్వినియోగదారుడని పేర్కొన్న ట్రంప్.. 2020 అక్టోబరులో టారిఫ్ కింగ్ అనే ముద్ర వేశారు.

ఈ నేపథ్యంలో తన రెండో టర్మ్‌లో పటిష్టమైన వాణిజ్య చర్చలను ట్రంప్ తీసుకొచ్చే అవకాశం ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘అమెరికా ఫస్ట్ ఎజెండా భారతీయ వస్తువులపై పరస్పర సుంకాలు, ఆటోమొబైల్స్, వైన్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలకమైన భారతీయ ఎగుమతులపై సుంకాలు పెంపు వంటి చర్యల చేపట్టే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో భారతీయ ఉత్పత్తులకు అమెరికాలో ప్రాధాన్యత తగ్గుతుంది.. ఈ రంగాలలో ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయి’ అని శ్రీవాస్తవ చెప్పారు.

అయితే, చైనాపై అమెరికా కఠిన వైఖరి భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలపడిందని, 2022-23లో USD 129.4 బిలియన్లగా ఆదాయం... 2023-24లో 120 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా, డబ్ల్యూటీఓ వరల్డ్ టారిఫ్ ప్రొఫైల్స్ 2023 ప్రకారం.. డెయిరీ ఉత్సత్తులు, పండ్లు, కూరగాయలు, ఆహార తయారీ వస్తులు, నూనెగింజలు, నూనెలు, కొవ్వులు, బెవరేజెస్, పొగాకుపై అధిక శాతం దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది.

అంతర్జాతీయ వాణిజ్య నిపుణుడు బిశ్వజీత్ ధార్ మాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటోన్న ట్రంప్.. పలు రంగాలపై టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందన్నారు. ‘ట్రంప్ అధికారంలోకి రావడంతో మనం రక్షణవాదం భిన్నమైన యుగంలోకి ప్రవేశించబోతున్నాం’ అని ధార్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు దెబ్బతింటాయని చెప్పారు.

ట్రంప్ ఇంతకుముందు ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్‌షిప్ (టీపీపీ) నుంచి వైదొలిగినందున, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపీఈఎఫ్)పై నీలినీడలు కమ్ముకోవచ్చని ఆయన అన్నారు. అమెరికా సహా ఇండో-పసిఫిక్‌లోని 14 దేశాల ఈ కూటమిని 2022 మే 23న ఏర్పాటుచేశారు. అయితే, సమతుల్య వాణిజ్యం కోసం ముందుకు సాగాలని మేము ఆశిస్తున్నామని, కానీ సుంకాల విషయంలో వాణిజ్య వివాదాలు తలెత్తవచ్చని ఫెడరల్ ఇండియా ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ డీజీ అజయ్ సహాయ్ అన్నారు. సముద్రయానం, ప్రస్తుత సరఫరా గొలుసులను మార్చడానికి వ్యూహాత్మకంగా అధిక సుంకాలను విధించే అవకాశం ఉందని ఈవై ఇండియాకు చెందిన అగ్నేశ్వర్ సేన్ పేర్కొన్నారు.

Related News