డేటింగ్, పెళ్లి, సెక్స్, పిల్లలు బంద్.. ట్రంప్ రాకతో అమెరికన్ మహిళల నిరసన

Image 1

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించారు. అయితే ఇప్పుడు వైట్‌హౌస్‌లోకి ట్రంప్ అడుగుపెడుతున్న వేళ.. అమెరికాలో సరికొత్త ఉద్యమం ఊపందుకుంది. అమెరికా వ్యాప్తంగా మహిళలు సోషల్ మీడియా వేదికగా 4బీ ఉద్యమానికి తెరలేపుతున్నారు. ఇప్పటివరకు దక్షిణ కొరియాలో ఉన్న ఈ 4బీ ఉద్యమం.. అమెరికాలోకి రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ 4బీ ఉద్యమంలో భాగంగా మహిళలు.. డేటింగ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, సెక్స్ చేయడం, పిల్లల్ని కనడం ఆపేస్తారు. ఫలితంగా జనాభా తగ్గిపోతుంది. అందుకే ఈ 4బీ ఉద్యమం అమెరికాలో వ్యాప్తి చెందుతుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో అబార్షన్ హక్కులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అబార్షన్‌పై మహిళలకు హక్కులు ఉండటాన్ని వ్యతిరేకించిన ట్రంప్.. ఆ తర్వాత మాట మార్చడం గమనార్హం. అయితే ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మాత్రం.. అబార్షన్ అనేది మహిళల ఇష్టానికే వదిలేయాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ట్రంప్ అధికారంలోకి రావడంతో మహిళల అబార్షన్ హక్కులపై తీవ్ర ఆందోళన నెలకొంది.

తమ నుంచి అబార్షన్ హక్కులను లాగేసుకున్నారని అమెరికన్ మహిళలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పురుషులతో డేటింగ్ చేయడానికి తీవ్ర ఆందోళనగా ఉందని చాలా మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో 4బీ ఉద్యమం అమెరికా వ్యాప్తంగా ఊపందుకుంది. ఈ క్రమంలోనే తాము కూడా ఈ 4బీ ఉద్యమంలో తాము కూడా చేరుతున్నట్లు సోషల్ మీడియాలో మరింత మంది మహిళలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ 4బీ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహిళల శరీరాలపై నిరంతం రాజకీయాలు జరుగుతున్నాయని.. అమెరికాలో ఒక గణనీయమైన మార్పును తీసుకురావడానికి సాహసోపేతమైన 4బీ ఉద్యమం ఖచ్చితంగా అవసరం పడుతుందని ఆ మహిళలు భావిస్తున్నారు. దేశంలో లింగ అసమానతలపై పురుషులను పూర్తిగా బహిష్కరించాలని పలువురు మహిళలు కోరుతున్నారు. కొందరు ప్రారంభించిన ఈ 4బీ ఉద్యమానికి భారీగా మహిళలు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి ఉద్యమం అనూహ్య పరిణామాలకు దారి తీస్తుందని మరికొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News