అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ప్రపంచ దేశాలు.. అమెరికా కొత్త అధ్యక్షుడి హయాంలో ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ట్రంప్ 2.0 హయాంలో భారత్-అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్-అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వీటి విషయాల్లో భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తిని రేపుతోంది.
అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ.. ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టినట్లు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అమెరికా దేశ ప్రయోజనాలకు ఆయన అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. పారిస్ వాతావరణ ఒప్పందాలు, ఇరాన్ అణు ఒప్పందంతో సహా కీలక అంతర్జాతీయ ఒప్పందాల్లో కొన్నింటి నుంచి అమెరికా బయటికి రావడం లేదా మరికొన్నింటిని పరిష్కరించడం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలతో ఇప్పటివరకు అమెరికా చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో మరీ ముఖ్యంగా దౌత్యం, వాణిజ్యం, వలసలు, సైనిక సహకారం వంటి వాటిలో పెను మార్పులు వస్తాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు..
భారత్-అమెరికా మధ్య సంబంధాల్లో ప్రధాన అంశం వాణిజ్యం. అమెరికా నుంచి విదేశాలకు వెళ్లే ఉత్పత్తులపై ఆయా దేశాలు అత్యధిక ట్యాక్స్‌లను విధిస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపైనా తాము అధిక ట్యాక్స్‌లు విధిస్తామని తేల్చి చెప్పారు. ఇదే జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధింపు నిర్ణయం ట్రంప్ తీసుకుంటే అందులో భారత్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో భారత్ గురించి స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తమకు మిత్ర దేశమని.. నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని ప్రశంసల జల్లు కురిపించారు. అయితే అదే సమయంలో అమెరికా వస్తువులకు భారత్ విధిస్తున్న పన్నుల అంశాన్ని కూడా ప్రస్తావించారు.
భారత్ అమెరికా ఇమ్మిగ్రేషన్..
ఏటా భారత్ నుంచి అమెరికాకు లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇందులో కొన్ని వేలమంది హెచ్-1బి వీసాలపై అక్కడికి చేరుకుంటారు. మరీ ముఖ్యంగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో హెచ్-1బి వీసాలపై పంపిస్తూ ఉంటాయి. అయితే గతంలో ఈ విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారు. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హెచ్-1బి వీసాల విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలోనే అమెరికా ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో సమానంగా హెచ్-1బి వీసాదారులకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఎటువైపు మొగ్గుచూపుతారో అని హెచ్-1బి వీసాదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
సైనిక సహకారం..
సైనిక రంగంలో భారత్‌కు అమెరికా ఎప్పటినుంచో ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి రెండు దేశాల మధ్య కీలక సైనిక- రక్షణ ఒప్పందాలు కొనసాగుతునే ఉన్నాయి. జో బైడెన్ హయాంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ మధ్య కీలక ఒప్పందం కూడా జరిగింది. దీంతో పాటు క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఒప్పందం కూడా కుదిరింది.
అయితే అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నా.. అమెరికా- భారత్ లక్ష్యం ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవడమే. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో క్వాడ్ కూటమి సహకారం కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ను.. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంది. ఇక ఉగ్రవాదానికి వ్యతిరేకం అయిన ట్రంప్.. ఈ విషయంలో భారత్‌కు సహకారం ఇచ్చే అవకాశం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.