ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న జాకీర్ హుస్సేన్ (73).. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆనారోగ్య కారణాలతో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో జాకీర్ హుస్సేన్‌ను చేర్పించారు. పరిస్థితి విషమించటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆదివారం జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్‌ను ఆస్పత్రిలో చేర్చిన విషయాన్ని ఆయన సన్నిహితుడు.. ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా కూడా ధ్రువీకరించారు. జాకీర్ హుస్సేన్‌కు రక్తపోటు ఉన్నట్లు తెలిసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో ఆయన వారం రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
జాకీర్ హుస్సేన్ పూర్తిపేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి.. 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా విద్యాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ తనయుడే జాకీర్ హుస్సేన్. తన నైపుణ్యంతో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు అందరికీ జాకీర్ హుస్సేన్ చిరపరిచితులయ్యారు. ఏడేళ్ల ప్రాయంలోనే జాకీర్ హుస్సేన్ తబలాతో తన ప్రయాణం ప్రారంభించారు. 12 ఏళ్లు వచ్చేసరికి దేశమంతటా ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. తన ఇన్నేళ్ల కెరీర్‌లో భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేశారు. జాకీర్ హుస్సేన్ తన అసాధారణ తబలా నైపుణ్యంతో పలు భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు పనిచేశారు. సుమారు 40 ఏళ్ల కిందట జాకీర్ హుస్సేన్ కుటుంబంతో సహా శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. అక్కడి నుంచే సంగీత ప్రపంచానికి సేవలు అందిస్తూ వచ్చారు.
జాకీర్ హుస్సేన్ అవార్డులు
ఇన్నేళ్ల తన సంగీత ప్రయాణంలో జాకీర్ హుస్సేన్ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులతో పాటుగా అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో జాకీర్ హుస్సేన్‌ను వరించాయి. భారత ప్రభుత్వం కూడా అనేక పౌర పురస్కారాలతో ఆయనను గౌరవించింది. 1988లో పద్మశ్రీ అవార్డుతో జాకీర్ హుస్సేన్‌ను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం.. 2002లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. 2023లో జాకీర్ హుస్సేన్‌కు పద్మ విభూషణ్ పురస్కారం అందజేసింది. 1990లో జాకీర్ హుస్సేన్‌కు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా వరించింది. సంగీత ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారంగా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును పేర్కొంటారు. ఈ అవార్డును 1990లో జాకీర్ హుస్సేన్‌కు ప్రదానం చేశారు.