ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఓవైపు.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ ప్రకటించగా.. హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా.. సంధ్య థియేటర్‌లో జరిగిన అభిమానుల తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించటంపై.. అల్లు అర్జున్ టీంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే.. ఈరోజు (డిసెంబర్ 13న) అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌కు బన్నీని తరలించి.. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు అటునుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత.. నాంపల్లి కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే పోలీసులు ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు కూడా.
ఈ క్రమంలోనే.. పుష్ప సినిమాకు మించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌ను జైలుకు తీసుకెళ్లిన మరుక్షణమే.. హైకోర్టు అనూహ్య నిర్ణయం వెలువరించింది. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే.. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనే.. ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన అన్ని కేసులను కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పు వెలువరించింది. పర్సనల్ బాండ్ తీసుకొని విడుదల చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ తరపున ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.
ఈ కేసులో పెట్టిన అన్ని సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని న్యాయస్థానం అభిప్రాయనడింది. నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని పేర్కొంది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని.. కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? అంటూ ప్రశ్నలు సంధించింది. రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని.. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని హైకోర్టు అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. అటు ప్రభుత్వ తరపు వాదనలు, అల్లు అర్జున్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను జనవరి 21కి వాయిదా వేసింది. మొత్తంగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో అల్లు అర్జుజ్ కేసులో భారీ ఊరట లభించినట్టయింది.
అయితే.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ మీద నానా బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయటం.. ఈరోజు ఉదయం అరెస్ట్ చేయటం.. స్టేషన్‌కు తరలించటం.. అటు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకెళ్లటం.. 14 రోజులు రిమాండ్ విధించటం.. ఆ వెంటనే హుటాహుటిన చంచల్ గూడా జైలుకు తరలించటం.. అదే సమయంలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం లాంటి పరిణామాలు చూస్తుంటే.. పుష్ప సినిమాను మించిన ట్విస్టులు చోటుచేసుకున్నట్టుగానే కనిపిస్తోంది.